హైదరాబాద్, 8 ఆగస్టు 2010:
ఉపాధ్యాయ ఉద్యమ బలోపేతానికై ఆదివారం విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర విద్యా సదస్సును జయప్రదం చేయాలని యుటిఎఫ్ కోరింది. విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా ఆచరణలో మాత్రం అస్తవ్యస్తంగా మారిపోతున్నది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ ఉద్యమాన్ని బలోపేతం చేసి, మరింత పురోగతి సాధించాలనే ఉద్దేశంతో సదస్సును నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. బడి ఈడుగల బాలలందరికీ ఉచితంగా నిర్బంధంగా చదువు చెప్పాలని, అందుకోసం విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటించింది. కానీ అందుకు సంబంధించిన విధి విధానాలు గానీ, కార్యాచరణ గానీ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కనిపించటమే లేదంటూ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎన్ నారాయణ, ఐ వెంకటేశ్వరరావు ఆ ప్రకటనలో ఆవేదన వెలిబుచ్చారు. ఓపక్క రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా హైస్కూళ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయిలు వెచ్చిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది కానీ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలు మాత్రం కనీస వసతులు కూడా కరువై కునారిల్లుతున్నాయి.
ఇక ఉన్నత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల పాలైందంటూ ఆ ప్రకటన పేర్కొంది. మరో పక్క విద్యావ్యాపారానికి గేట్లు తెరిచిన ప్రభుత్వం పిపిపి పేరుతో విద్యారంగాన్ని ప్రయివేటుకు అప్పజెబుతోంది. ఎయిడెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీ చేయనందున తీవ్ర కొరత ఏర్పడింది. ప్రభుత్వ ఇలాంటి చర్యల వల్ల విద్యారంగం దివాళా దిశలో పయనిస్తుందంటూ ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయ హక్కుల రక్షణ, ఆర్థిక ప్రయోజనాల కోసం యుటిఎఫ్ చేస్తున్న పోరాటాల వల్ల కొన్ని ఫలితాలు లభించినట్లు వారు తెలిపారు. అయినా కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ ఉద్యమాన్ని పురోగమింపజేయడానికి చేపట్టవలసిన చర్యలు చర్చిండానికై జరుగుతున్న ఈ సదస్సులో ఉపాధ్యాయులు, విద్యారంగ శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అధ్యక్ష కార్యదర్శులు ఆ ప్రకటనలో కోరారు.