Thu, 24 Feb 2011:
ఇప్పటిదాకా పాఠశాల విద్యాశాఖ, సంచాలకులు ఇచ్చిన నిబంధనల్లో ఏవైనా ఈ నిబంధనలకు పాసగనివి వుంటే అవి ఇకపై చెల్లుబాటు కావు. అవన్నీ ఈ నిబంధనలకు అనువుగా మారిపోవాల్సిందే. మొత్తం మీద ఈ నిబంధనలు విద్యాహక్కుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేదానికన్నా వివాదాలకే ఎక్కువ ఆస్కారమిచ్చేట్లుగా ఉన్నాయి.
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నం. 14 ద్వారా ఈ నెల 22న ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టం దేశ వ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. దీనిని అమలు చేసే నమూనా నిబంధనలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆనాడే రాష్ట్రాలకు పంపింది. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకటించటానికి 11 నెలల సమయం తీసుకుంది. విద్యాహక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ''ఆంధ్రప్రదేశ్ బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు నిబంధనలు 2010''గా పిలువబడే ఈ నిబంధనలు 2010 ఏప్రిల్ 1 నుండే అమల్లోకి వచ్చినట్లుగా భావించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందులో మొత్తం 29 నిబంధనలున్నాయి. వాటికి అనుబంధంగా 4 ఫారాలను పొందుపరిచారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం 6-14 ఏళ్ల మధ్య వయసుగల బాలలు అందరూ బడిలోనే వుండాలి. ప్రతి ఒక్కరికి 8వ తరగతి వరకు నిర్బంధంగా చదువు చెప్పాలి. ప్రస్తుతం బడిలో లేని పిల్లలను వెంటనే బడిలో చేర్చాలి. అయితే వారిని వారి వయసుకు తగిన తరగతిలో చేర్చాలి. ఉదాహరణకి 9 సంవత్సరాల వయసుగల వారు 4వ తరగతిలో వుండాలి. అలాంటి వారికి 4వ తరగతి స్థాయిగల విద్యా విషయక పరిజ్ఞానాన్ని సమకూర్చటం కోసం ప్రత్యేక బోధన జరపాలి. ఈ ప్రత్యేక బోధనా కాలం పిల్లల అవసరాన్ని బట్టి 3 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు వుండవచ్చు. ఇందుకోసం సర్వీసులో వున్న ఉపాధ్యాయులకు లేదా ప్రత్యేకంగా నియమించే ఉపాధ్యాయులకు ముందుగా తర్ఫీదు ఇవ్వాలి.
అయిదో నిబంధన ప్రకారం పిల్లల పరిసర ప్రాంతంలో పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కిలో మీటర్ నడకలోపు ప్రాథమిక పాఠశాల (1-5 తరగతులు)ను, మూడు కిలోమీటర్ల నడకలోపు ప్రాథమికోన్నత పాఠశాల (1-8 తరగతులు)ను ఏర్పాటు చేయాలి. నిర్ణీత దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయలేని పిల్లల కోసం రవాణా సదుపాయం కల్పించాలి లేదా నైవాసిక విద్యా సదుపాయం ఏర్పాటు చేయాలి. అంగవైకల్యం గల పిల్లలకు రవాణా సదుపాయం కల్పించాలి లేదా ఇంట్లోనే చదువు చెప్పే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదివే విద్యార్థులు అందరికీ పాఠ్య పుస్తకాలు, దుస్తులు, రాత సామాగ్రి వంటి అన్ని రకాల సదుపాయాలను ఉచితంగా అందించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల చదువుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. దళిత, గిరిజన తదితర బలహీన వర్గాల పిల్లల విషయంలో ఎలాంటి వివక్షా చూపకూడదు. తరగతి గదిలో కూర్చొనే దగ్గర, మధ్యాహ్న భోజనం, మంచినీరు, టారులెట్స్ వినియోగం తదితర అన్ని విషయాల్లోనూ అందరికీ సమాన అవకాశాలు వుండాలి. పిల్లలు పుట్టిన నాటి నుండి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రత్యేక రిజిష్టర్ నిర్వహించాలి. దానిని ప్రతి ఏటా తాజా పర్చాలి. పిల్లలు ఎక్కడ వున్నారు, ఏం చదువుతున్నారో తెలియాలి. ఈ రిజిష్టర్ అందరికీ అందుబాటులో వుండాలి.
పరిసర ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల లేకపోతేనే ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రైవేట్ స్కూల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25 శాతం వరకు పరిసర ప్రాంతంలోని బలహీన వర్గాల పిల్లల ప్రవేశానికి అనుమతించాలి. ఆ 25 శాతంలో 5 శాతం అనాథóలు, హెచ్ఐవి బాధితులు, అంగవికలురు, 10శాతం దళితులు, 4శాతం గిరిజనులు, 6శాతం బిసి, మైనార్టీ మరియు వార్షికాదాయం రు. 60 వేలలోపు వుండే ఓ.సి. కుటుంబాల పిల్లలను చేర్చుకోవాలి. వీరిలో ఏదైనా ఒక కేటగిరీ వారు తమ వాటా మేరకు ప్రవేశం కోరకపోతే సదరు సీట్లను తదుపరి కేటగిరీ వారికి అనుమతించాలి. ఆ విధంగా ప్రైవేట్ స్కూళ్లలో చేరే పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు వెచ్చిస్తున్న ఖర్చుతో సమానంగా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. పిల్లల జనన ధృవీకరణ సంబంధిత రిజిష్టర్‌లో నమోదు కాకపోతే హాస్పిటల్ లేదా ఏఎన్ఎం రికార్డ్, అంగన్వాడీ రికార్డ్ లేదా తల్లిదండ్రుల స్వీయ ధృవీకరణను ప్రాతిపదికగా పరిగణించాలి. విద్యాసంవత్సరం ప్రారంభంలో జూన్ 12 నుండి ఆగస్ట్ 31 దాకా పిల్లలను బడిలో చేర్చుకొనే నిర్ధిష్ట గడువుగా నిర్ణయించారు. అయితే ఆ గడువు తర్వాత చేరే వారిని కూడా మరో మూడు నెలల వరకు అనుమతించటం జరుగుతుంది.
ఈ నిబంధనల్లో ఐదు అంశాలను ప్రైవేట్ స్కూళ్ల కోసం కేటాయించారు. చట్టం అమల్లోకి వచ్చిన 3 నెలల్లోగా ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికే నడుస్తున్నవి, క్రొత్తగా నెలకొల్పబోయేవి ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. చట్టంలో పేర్కొన్న అన్ని నిబంధనలు పాటించాలి. అధికారులు భౌతిక పరిశీలన చేసి అర్హతగల వాటికి గుర్తింపు ఇస్తారు. గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్ల వివరాలను వెబ్సైట్లో పెట్టి అందరూ తెలుసుకొనే అవకాశం కల్పించాలి. ప్రైవేట్ స్కూళ్లను అధికారులు తరచుగా తనిఖీలు చేస్తుండాలి. అనుమానం కలిగితే ఎప్పుడైనా గుర్తింపును రద్దు చేయవచ్చు. ప్రభుత్వ గుర్తింపు కోసం నిబంధనలు రూపొందించటం వరకు బాగానే వుంది. కానీ ఇవి ఎంతవరకు అమలవుతాయి అనేది ప్రభుత్వ సామర్థ్యం మీద ఆధారపడి వుంటుంది.
క్షేత్ర స్థాయిలో విద్యాహక్కుని అమలు చేసేది పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసి)లు. అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మినహా అన్ని పాఠశాలల్లోనూ పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయాలి. ఎస్‌ఎంసిలో మొత్తం 27 మంది సభ్యులు వుంటారు. అందులో 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులు వుంటారు. వివిధ తరగతుల్లోని అత్యధిక, అత్యల్ప మార్కులు వచ్చిన వారి తల్లిదండ్రులను సభ్యులుగా నిర్ణయిస్తారు. గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ ప్రతినిధులు వుంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది మహిళలు వుండాలి. పాఠశాల ప్రాంతంలోని ప్రజా ప్రతినిది,ó మహిళా సమాఖ్యలోని ఒకరిని కూడా సభ్యులుగా చేరుస్తారు. గ్రామాల్లో అయితే వార్డు మెంబర్, పట్టణాల్లో అయితే కౌన్సిలర్ లేదా కార్పోరేటర్ కమిటీకి చైర్‌పర్సన్‌గా, హెడ్మాష్టర్ మెంబర్ కన్వీనర్‌గా వుంటారు. గ్రామాల్లోని అప్పర్‌ప్రైమరీ స్కూల్స్ చైర్ పర్సన్స్‌గా సర్పంచ్ వుంటారు. తల్లిదండ్రుల సభ్యుల్లో నుండి ఒకరిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకొంటారు. విద్యాహక్కు చట్టంలోని ప్రాథమిక కర్తవ్యాలతో సహా పిల్లలందరికీ చదువు చెప్పించే బాధ్యత ఎస్ఎంసిలపైనే వుంటుంది. అయితే తల్లిదండ్రుల సభ్యులను ఎన్నిక ద్వారా కాకుండా మార్కుల ఆధారంగా నిర్ణయించటం అనేది ప్రజాస్వామిక విధానం కాదు. ఇది వివాదాస్పదం అయ్యే అవకాశం వుంది. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్ల జీత భత్యాలు, విధివిధానాలను ప్రభుత్వ చట్టాలకు, నిబంధనలకు లోబడి మేనేజిమెంట్స్ నిర్ణయించి అమలు చేయాలని 21వ నిబంధనలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ నిబంధన అమలు కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సంఘటితం కావటానికి కృషి చేయవచ్చు. ఇక అన్ని రకాల పాఠశాలల్లోని ఉపాధ్యాయులు చేయాల్సిన విధులను 22వ నిబంధనలో పొందుపరిచారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాథమిక వేదిక ఎస్ఎంసి అన్నారు. అక్కడ పరిష్కారం కాకపోతే మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీకి పోవాలని చెప్పారు. ఈ నిబంధన ఉపాధ్యాయుల్లో ఆందోళన కల్గిస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి పాఠశాలలో విద్యార్థ్ధుల సంఖ్యను నిర్ధారించి, దాని ఆధారంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను నిర్ణయించాలి. అవసరమైన ఉపాధ్యాయులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. అదనంగా వుండే ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు తరలించాలి. పదేళ్లకోసారి వచ్చే జనగణన, అలాగే పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాల వంటి అంశాలు మినహా ఇంకేవిధమైన విద్యేతర విధులను ఉపాధ్యాయులతో చేయించకూడదు. అలా చేయించే అధికారులు క్రమశిక్షణా చర్యలకు గురవుతారు.
అకడమిక్ అథారిటీ బాధ్యతలను ఎస్‌సిఇఆర్‌టి (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ)కి అప్పగించారు. కరిక్యులమ్, సిలబస్, ఉపాధ్యాయులకు వృత్త్యంతర శిక్షణ, నిరంతర మూల్యాంకనం తదితర విషయాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. రాష్ట్ర స్థాయిలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసేదానికి రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ని నియమించాలి. ఈ పని వెంటనే చేయలేకపోతే ముందస్తు పనికోసం విద్యాహక్కు రక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీిని చైర్‌పర్సన్‌గా ప్రముఖ విద్యావేత్త, హైకోర్టు జడ్జి, బాలల హక్కుల ఉద్యమకర్త ఎవరినైనా నియమించవచ్చు. మరో నలుగురు సభ్యులు వివిధ రంగాల్లో నిపుణులైనవారు వుండాలి. చట్టం అమలు కోసం రాష్ట్ర స్థాయి సలహా సంఘం వుండాలి. దానికి ఒక చైర్పర్సన్, ఒక వైస్‌చైర్‌పర్సన్, 13 మంది సభ్యులు వుండాలి. ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎక్స్ అఫీసియో కో-చైర్‌పర్సన్‌గా, పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎక్స్ అఫీసియో చైర్‌పర్సన్‌గా వుంటారు. సభ్యులుగా విద్యారంగంలో, బాలల వికాసంలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వమే నియమిస్తుంది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి, కో - కన్వీనర్‌గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. గిరిజన, సాంఘిక, బిసీ, మైనార్టీ సంక్షేమశాఖా కార్యదర్శులు, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖా కార్యదర్శులు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వంగల ప్రభుత్వ గుర్తింపు గల్గిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రత్యేకాహ్వానితులుగా వుంటారు.
ఇప్పటిదాకా పాఠశాల విద్యాశాఖ, సంచాలకులు ఇచ్చిన నిబంధనల్లో ఏవైనా ఈ నిబంధనలకు పాసగనివి వుంటే అవి ఇకపై చెల్లుబాటు కావు. అవన్నీ ఈ నిబంధనలకు అనువుగా మారిపోవాల్సిందే. మొత్తం మీద ఈ నిబంధనలు విద్యాహక్కుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేదానికన్నా వివాదాలకే ఎక్కువ ఆస్కారమిచ్చేట్లుగా ఉన్నాయి.