Home UTF History Ikya Upadhyaya Magazine News GO's Statements Mahasabhalu Photo Gallery STFI- School Teacher's Federation of India
 
 
 
 
 
 

 

UTF News

ఎస్‌ఎస్‌సి బోర్డు ఎత్తేస్తే నష్టమే!
- నాగాటి నారాయణ

ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యతో విలీనం చేసి సెకండరీ విద్యగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయంతోనే పదో తరగతి పబ్లిక బోర్డ్‌ డేంజర్‌ జోన్‌లో ప్రవేశించింది. ఇక కేంద్ర విద్యామంత్రి కపిల్‌సిబాల్‌ ప్రకటించిన వందరోజుల ఎజెండాతో ఎస్‌ఎస్‌సి బోర్డ్‌ను మూసేయడం అనివార్యం అయినట్లే!అయినా సెకండరీ విద్యాశాఖా మాత్యులు మాణిక్య వరప్రసాద్‌ గారు 'ప్రాణం పోతున్న రోగిని కూడ ఏం ఫర్వాలేదనే డాక్టర్‌ తరహాలో మన పదో తరగతిపరీక్షకి ప్రమాదం ఏమీలేదని చెబుతున్నారు. నిప్పు లేనిదే పొగ ఎందుకు వస్తుందనేది నిత్య సత్యం.పదో తరగతి పరీక్ష విద్యార్థులకు, తల్లిదండ్రులకు తీవ్రమైన మానసికఒత్తిడి కలిగిస్తోంది. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అందువలన అలాంటి పరీక్ష ఎందుకని సిబాల్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 12వ తరగతి వరకు ఒకే యూనిట్‌గా వున్నందున 12వ తరగతి బోర్డ్‌ పరీక్ష వుండగా పదో తరగతికి కూడ బోర్డ్‌ పరీక్ష ఎందుకని మరో ప్రశ్న వేశారు. పదో తరగతి పైన చదువుకోలేని వారికి పదో తరగతి సర్టిఫికెట్‌తో వృత్తివిద్యా కోర్స్‌లకు, ఉపాధి అవకాశాలు చూసుకొనేవారికి నష్టమని భావిస్తే నష్టం జరక్కుండా చూడవచ్చని, అందువలన పదో తరగతి బోర్డ్‌ పరీక్షను ఐచ్చికం (ఆప్షనల్‌) చేస్తే సరిపోతుందని సెలవిచ్చారు.

విద్యావేత్తలు, ఉపాధ్యాయుల నుండి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త కోసం 'విద్యార్థుల ఇష్టం' అన్నట్లుగా చెప్పారు. సిబాల్‌ గారి ప్రతిపాదనలోని లాభ నష్టాల వివరణకు పెద్ద వ్యాసమే రాయాల్సి వుంటుంది. అయితే దీని ప్రభావం మన రాష్ట్రంలో ఎలా వుంటుందో అంచనా వేసుకోవటంమంచిది.సీబీఎస్‌ఇ సిలబస్‌తో నడిచే పాఠశాలల పరీక్షలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గల 38 రకాల పబ్లిక పరీక్షా బోర్డ్‌లను రద్దుచేసి, వాటి స్థానంలో ఒకే ఒక జాతీయ బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. అవిగాక వివిధ రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎస్‌సి బోర్డు లాంటివి) గల బోర్డులను అలాగే కొనసాగిస్తారా లేక జాతీయ బోర్డు పరిధిలోకి వస్తారా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చుకోవాలని సూచించారు. దీని ప్రకారం మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గత విద్యా సంవత్సరం నుండి ప్రారంభించిన సక్సెస్‌ పథకం ప్రకారం 6500 హైస్కూల్స్‌లోని ఇంగ్లీష్‌ మీడియం (సిబిఎస్‌ఇ సిలబస్‌ గనుక) సెక్షన్స్‌ 12వ సెక్షన్స్‌ కూడా 6 నుండి 12వ తరగతి వరకు ఒకే యూనిట్‌గా ఏర్పడతాయి గనుక ఇక్కడ మాత్రం పదో తరగతి పరీక్ష ఎందుకనే సందేహం బలపడుతుంది.

ఈ పరిణామం ఇలాగే కొనసాగితే ఇంకో మూడేళ్ల తర్వాత అయినా మన రాష్ట్రంలో ఎస్‌ఎస్‌సి బోర్డు ఎగిరిపోతుంది.మన ఎస్‌ఎస్‌సి బోర్డు రద్దయితే ఏమవుతుంది? పేద, మధ్యతరగతి వర్గాల వారికి పెద్ద నష్టం జరుగుతుంది. ప్రపంచబ్యాంక పంతం నెగ్గుతుంది. ప్రైవేట్‌ విద్యా వ్యాపారం మరింత విస్తరిస్తుంది. మన ఎస్‌ఎస్‌సి సర్టిఫికెట్‌కి ఎంతో విలువుంది. పై చదువులకు వెళ్లలేని వారికి క్రిందిస్థాయి (రికార్డ్‌ అసిస్టెంట్‌లు, హౌమ్‌గార్డ్‌లు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ క్లరికల్‌ పోస్టులు వగైరా) ఉద్యోగాలకు అర్హతగా వున్నది. ఐటిఐ, పాలిటెక్నిక, పారామెడికల్‌ తదితర వృత్తి విద్యా కోర్సులకు, ఉపాధి అవకాశాలకు ఆధారంగా వున్నది. ప్రైవేట్‌ రంగంలో కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు కనీసం పదో తరగతి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతటి బహుళ ప్రయోజనకారి అయిన పదో తరగతి సర్టిఫికెట్‌ లేకపోతే నష్టం కాదా? లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆధారమైన ఎస్‌ఎస్‌సి సర్టిఫికెట్‌లు ఇచ్చే బోర్డుని రద్దు చేయటమంటే సర్టిఫికెట్లకు, ఉద్యోగాలకు లింక వుండకూడదనే ప్రపంచబ్యాంక పంతం నెరవేరినట్లు అవుతుంది. పబ్లిక పరీక్షలు, ఫలితాల కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేకుండా పైన పటారంతోనే విద్యా వ్యాపారం చేసుకునే అవకాశాలు ప్రైవేట్‌ వారికి విస్తరిస్తాయి. కనుక ఏ విధంగా చూసినా ఎస్‌ఎస్‌సి బోర్డుని ఎత్తేస్తే నష్టమే. అయితే పరీక్షా విధానంలో మార్పు చెయ్యదల్చుకుంటే చెయ్యవచ్చును. అందుకు విస్తృతమైన చర్చ జరపాలి. తలనొప్పిని తగ్గించాలంటే తలనే తీసేస్తారా?

 
 
 
 

PDF
 
 

Copyright © 2008-
A.P.United Teachers' Federation
Mail to : aputf2000@yahoo.com
Home | Ikya Upadhyaya | News | GO's | Statements | STFI | Contact Us