హైదరాబాద్, 22 ఆగస్టు 2010:
* 30న ఐటిడిఎ కేంద్రాల వద్ద ధర్నాలు
* అప్రెంటీస్ రద్దు చేయాలని 5న నిరసనలు
* 7న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
* 25న జెఎసి చలో సెక్రటేరియట్
* యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయం
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగవ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని యుటిఎఫ్ రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఉపాధ్యాయ నియామకాల్లో అసంబద్ధమైన అప్రెంటీస్ విధానాన్ని రద్దు నిర్వహించాలని సెప్టెంబర్ 5న గురుపూజోత్సవంనాడు నిరసన ప్రదర్శనలు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను, అదనపు సిబ్బందిని భర్తీ చేయాలని కోరుతూ ఈనెల 30న అన్ని ఐటిడిఎ కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. అధిక ధరలు అరికట్టాలని, పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు ఉపసంహరించాలని, ప్రభుత్వ పెన్షన్ పథకాన్ని కొనసాగించాలని, ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేయాలని కోరుతూ సెప్టెంబర్ 7న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని జెఎసి నేతృత్వంలో సెప్టెంబర్ 25న చలో సెక్రటేరియట్‌ను లక్ష మందితో జరపాలని, యుటిఎఫ్ నుంచి పదివేల మందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రెండురోజులగా హైదరాబాద్‌లో యుటిఎఫ్ రాష్ట్రకార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.
సమావేశాల సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ నారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలని, ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ఎ పెంచాలని, టీచర్ల నియామకాల్లో ఉన్న అప్రెంటీస్ విధానం రద్దు చేయాలని, స్పెషల్ విద్యావాలంటీర్ల సర్వీస్‌ను రెగ్యులర్ సర్వీస్‌గా పరిగణించాలని, ఎస్సీ, ఎస్టీ, బిసి అన్‌ట్రైన్డ్ ఉపాధ్యాయుల సర్వీస్‌ను రెగ్యులర్ సర్వీస్‌గా పరిగణించి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ బదిలీలను అరికట్టాలని, ఎంఇవోలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. సక్సెస్ హైస్కూళ్లలో టీచర్ పోస్టులను, ఇతర పాఠశాలలన్నింటికీ నాన్‌టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి ఉపాధ్యాయుల అన్‌ట్రైన్డ్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 15 లోగా ఎస్సీ, ఎస్టీ, బిసి ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరతామన్నారు. అయినా ప్రభుత్వ స్పందించకపోతే ఈనెల 30న అన్ని ఐటిడిఎ కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తామని చెప్పారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2151 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర సిబ్బందిని నియమించడానికి ప్రత్యేక డిఎస్సీని వేయాలని కోరారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.