Home UTF History Ikya Upadhyaya Magazine News GO's Statements Mahasabhalu Photo Gallery STFI- School Teacher's Federation of India
 
 
 
 
 
 

 

UTF News

ఈ గ్రేడింగ్‌తో ఒరిగేది ఏంటి?
- ఎం.ఏ.కె. దత్‌,
యుటియఫ్‌ ఎకడమిక్‌ సెక్రటరీ,
సెల్‌ నం. 9490300580

రాష్ట్ర ప్రభుత్వం 2005లో 10వ తరగతి పరీక్షా విధానంలో సంస్కరణలు తేవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు యాజమాన్యాల సంఘాల ప్రతినిధులతో తేది. 1.12.2005న ఒక సమావేశం ఏర్పాటు చేసి 10వ తరగతిలో పరీక్ష పేపర్లు కుదించటానికి, పరీక్షా విధానంలో గ్రేడింగ్‌ విధానం ప్రవేశ పెట్టటానికి ప్రతిపాదనలు చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేకపోయింది. తర్వాత జిల్లాలలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులలో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి, వారు అంగీకరించారని చెప్పి తమ ప్రతిపాదనలు అమలు చేయటానికి ప్రయత్నించింది. ఉపాధ్యాయుల నుండి వ్యతిరేకత నిరసన వ్యక్తం కావటంతో ఆ సంస్కరణలు ప్రక్కన పెట్టింది. కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం రెండవసారి రాగానే విద్యారంగంలో సంస్కరణలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్‌ సిబాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండానే దేశ వ్యాప్తంగా ఒకే విద్యా బోర్డు, ఒకే పరీక్షా విధానం ఉండాలని, 10వ తరగతిలో పబ్లిక్‌ పరీక్ష ఐచ్ఛికం అని, మార్కుల స్థానంలో గ్రేడులు ప్రవేశ పెట్టాలని ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. దీనిపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. కపిల్‌ సిబాల్‌ తన ప్రతిపాదన బలవంతంగా రాష్ట్రాలపై రుద్దేదికాదని వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఉత్సాహంగా 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో మార్చి 2010 నుండి గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జి.ఓ. 592ను అక్టోబర్‌ 23వ తేదీ విడుదల చేసింది. పాఠశాల విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ ప్రవేశ పెట్టటం, ఇప్పుడు సిబిఎస్‌ఇ పద్ధతిలో పరీక్షా విధానంలో గ్రేడింగ్‌ పద్ధతి ప్రవేశ పెట్టటం, రాష్ట్ర ప్రభుత్వం విద్యను ఏ దిశగా తీసుకు వెళ్ళదలచిందో స్పష్టమౌతుంది.

ప్రస్తుత మన పరీక్షా విధానం విద్యార్థులు, తల్లి దండ్రులపైన విపరీతమైన వత్తిడి కలుగజేస్తోందని, 10,12 తరగతుల చివర నిర్వహిస్తున్న పరీక్షా విధానంలో మార్పు తేవాలని 'భారంలేని అభ్యసనం' నివేదిక సూచించింది. విషయాధారిత పరీక్షావిధానం లోపభూయిష్టమైన బోధనా పద్ధతులకు, కంఠస్తం చేయటానికి దారి తీస్తుందని, దీని వల్ల పరీక్షలంటే చాలా వత్తిడి పెరుగుతోందని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం (ఎన్‌సిఎఫ్‌)-2005 చెప్తూ ఈ విధానాన్ని మార్చాలని, మూల్యాంకనం నిరంతరంగా, సమగ్రంగా జరగాలని, మూల్యాంకనం వలన విద్యార్థి ప్రతిభ నిర్ధారించబడాలని, మార్కుల స్థానంలో గ్రేడులు ప్రవేశ పెట్టాలని సూచించింది. ప్రస్తుత విషయాధారిత పరీక్షా విధానం విద్యార్థిలోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, ప్రజ్ఞను, నూతన పరిస్థితులను ఎదుర్కొనగల శక్తిని నిర్ధారించేదిగా లేదు. ఈ లోపాన్ని సరిదిద్దటానికి పరీక్షా విధానంలో మార్పులు అవసరం.

ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థి ఫెయిల్‌, పాస్‌, ద్వితీయ శ్రేణి, ప్రథమ శ్రేణి అని నిర్ణయించటానికి ఏర్పరచుకొన్న కటాఫ్‌ మార్కులలో హేతుబద్ధత ఏమిటి? సంప్రదాయంగా వస్తున్నది మాత్రమే! ఈ పరిమితులు అన్ని సబ్జెక్టులకు, అన్ని తరగతులకు ఉపయోగిస్తున్నాం. కాని అన్ని సబ్జెక్టులు ఒకే విధమైన భారాన్ని కల్గి ఉండవు. తెలుగు మాతృభాష. ఇది సులభంగా అర్థమవుతుంది. గణితం కొంత క్లిష్టం. ఈ రెంటిలోనూ 50% ఒకే సామర్థ్యంగా సూచిస్తోంది మన పరీక్షా విధానం. ఇది సరైంది కాదు. ఈ విధానంలో ఒక్క మార్కు విద్యార్థి సంవత్సరం కాలం శ్రమను తారుమారు చేస్తుంది. 34 మార్కులు వస్తే పరీక్ష తప్పాడంటాం. 59% వస్తే సెకండ్‌ క్లాస్‌ అంటాం. నిజానికి ఇది సరైందేనా? ఆ ఒక్క మార్కు ఎవరి లోపం వలననైనా తగ్గవచ్చు. నష్టం మాత్రం విద్యార్థికి. ఇది అతని జీవితాన్ని శాశిస్తుంది. కనుక ప్రస్తుత పరీక్షా విధానం మారాలి.

విద్యార్థి ఒక విషయంలో సాధించిన ప్రగతిని తెలియజేసే సూచికలు (ఇండికేటర్స్‌) గ్రేడులు. గ్రేడింగ్‌ అంటే విద్యార్థి ప్రగతిని గుణాత్మకంగా అంచనా వేయటం. విద్యార్థి నిర్ధిష్ట కాలంలో నేర్చుకొన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి, అతనిలోని శక్తిని, అతని పరిమితుల్ని తెలుసుకోవటానికి గ్రేడులు ఉపయోగపడ్తాయి. ప్రతి విద్యార్థిలోనూ నైపుణ్యం ఉంటుంది. కాని అందరికీ అన్ని విషయాలలోనూ నైపుణ్యం ఉండదు. కొందరు కొన్ని విషయాల్లో నైపుణ్యం కల్గిఉంటే మరికొందరు మరికొన్ని విషయాల్లో నైపుణ్యం కల్గి ఉంటారు. ప్రతి విద్యార్థి ఏ విషయంలో ఏ స్థాయి నైపుణ్యం కలిగి ఉన్నాడో అతడు, ఉపాధ్యాయుడు తెలుసుకొనే అవకాశం గ్రేడింగ్‌ విధానంలో ఉంది. ఉదాహరణకు గణితంలో ఎక్కువ ఆసక్తి ఉన్న విద్యార్థి సోషల్‌లో తక్కువ ఆసక్తి కల్గి ఉండవచ్చు. ఇది గ్రేడింగ్‌ విధానంలో అంచనా వేయవచ్చు. ఫలితంగా విద్యార్థి తన పని విధానాన్ని అంచనా వేసుకొని ముందుకు పోవచ్చు. ఉపాధ్యాయుడు దానికి అనుగుణంగా వారికి కౌన్సిలింగ్‌ చేయవచ్చు. గ్రేడింగ్‌ విధానాలు రకరకాలుగా ఉన్నా, ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రవేశ పెడ్తామన్న సిబిఎస్‌ఇ విధానాన్ని స్వేచ్చాయుత తారతమ్య (అబ్జల్యూట్‌ గ్రేడింగ్‌) విధానం అంటారు. ఈ పద్ధతిలో విద్యార్థి పేపర్లను మామూలుగానే వాల్యూ చేస్తారు. ఒక సబ్జెక్టులో 33% మార్కులకన్నా తక్కువ వచ్చిన విద్యార్థులను ఫెయిల్‌గా పరిగణించి 'ఇ' గ్రేడు ఇస్తారు. పాసయిన విద్యార్థులందరి మార్కులను అవరోహణ క్రమంలో వ్రాసి వారిని 8 సమాన భాగాలుగా విభజిస్తారు. ఎక్కువ మార్కులు వచ్చిన మొదటి (టాప్‌) 1/8 వంతు మందికి ఏ1 గ్రేడు, తర్వాత 1/8 వంతు మందికి ఏ2 గ్రేడు, తర్వాత ప్రతి 1/8 వంతుకు వరుసగా బి1, బి2, సి1,సి2,డి1,డి2 గ్రేడులు ఇస్తారు. అన్ని సబ్జెక్టులలో పాసయిన వారికి మాత్రమే

పాస్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు. పాస్‌ సర్టిఫికెట్‌లో కేవలం రిజల్టు పాస్‌ అని ఇస్తారు. క్లాసుగాని ఓవరాల్‌ గ్రేడ్‌ గాని ఉండవు. మార్కుల లిస్టులో ప్రతి సబ్జెక్టులో మార్కులు, తత్సంబంధ గ్రేడు ఇస్తారు. ఫెయిల్‌ అయిన వారు రెండు పర్యాయాలు సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసుకొని పై క్లాసు చదవటానికి అర్హత పొందవచ్చు. 8 భాగాలుగా చేసిన విభజనలో సమాన మార్కు వచ్చిన వారు రెండు గ్రేడుల్లో ఉంటే ఎక్కువమంది ఉన్న గ్రేడునే మిగిలిన వారికి కూడ ఇస్తారు.

ఈ క్రింది ఉదాహరణతో గ్రేడులకు, మార్కులకు తేడాను అర్థం చేసుకోవచ్చు.

ఒక విద్యార్థికి సిబిఎస్‌ఇ 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలో ఈ క్రింది విధంగా మార్కుల షీట్‌ ఇచ్చారు.

ఇంగ్లీషు - మార్కులు 93 - గ్రేడు ఏ1, తెలుగు మార్కులు 88 - గ్రేడు బి1, గణితము-మార్కులు 76 - గ్రేడు బి1, సైన్సు - మార్కులు 93- గ్రేడు ఏ1, సోషల్‌-మార్కులు 85- గ్రేడు ఏ2, ఫలితం - పాస్‌.

పై మార్కులు పరిశీలిస్తే తెలుగులో 88 మార్కులకు బి1 గ్రేడు వస్తే సైన్సులో అదే 88 మార్కులకు ఏ1 గ్రేడు వచ్చింది. అంటే తెలుగులో 88 మార్కులు పైగా మాత్రమే వచ్చిన వారు 3వ 1/8 వంతు మందిలో ఉంటే, సైన్సులో 88 పైన మార్కులు వచ్చిన వారు మొదటి 1/8 వంతు మందిలో ఉన్నారు. దీనిని బట్టి సబ్జెక్టు వెయిటేజి అర్థం అవుతుంది. ఈ పద్ధతిలో విద్యార్థి ఒక సబ్జెక్టులో తాను ఏ స్థానంలో ఉన్నదీ తెలుసుకొంటాడు. ఈ విధానం విద్యార్థి మీద వత్తిడి తగ్గిస్తుంది.

అయితే సిబిఎస్‌ఇ పరీక్షా విధానంలో 1 నుండి 10వ తరగతుల వరకూ Continuous and comprehensive Evaluation ఉంటుంది. దీని కోసం వారు పరీక్షల్లో గ్రేడింగ్‌ పద్ధతి ప్రవేశ పెట్టారు. 1 నుండి 5 తరగతుల వరకూ 5 పాయింట్స్‌ గ్రేడింగ్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో విద్యార్థికి వచ్చిన మార్కులు గ్రేడులుగా A+, A, B, C, D అని ఇస్తారు. 6 నుండి 8 తరగతులకు 7 పాయింట్స్‌ గ్రేడింగ్‌ సిస్టమ్‌ అమలులో ఉంది. ఈ పద్ధతిలోనూ మార్కులను గ్రేడులుగా ఇస్తారు. 9,10 తరగతులకు 9 పాయింట్స్‌ గ్రేడింగ్‌ సిస్టమ్‌ అమలులో ఉన్నది. విద్యార్థి 1 నుండి 9 తరగతుల వరకు నేర్చుకొంటున్నది ఆ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు మదింపు చేసి, ఏ సబ్జెక్టులో వెనక పడ్డాడో చెప్పి, ధైర్యాన్నిస్తూ ముందుకు తీసుకువచ్చి 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలో ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్ష వ్రాయటానికి సహకరించే విధానం సిబిఎస్‌ఇ విధానం.

సిబిఎస్‌ఇ పరీక్షా విధానంలో 10వ తరగతిలో కేవలం 5 సబ్జెక్టులలో పరీక్షలు ఉంటాయి. అది కూడ సబ్జెక్టుకు 1 పేపర్‌ ఉంటుంది. అవి 1) ఇంగ్లీష్‌ - కమ్యూనికేటివ్‌ 2) తెలుగు లేదా హిందీ 3) గణితము 4) సైన్సు 5) సోషల్‌ సైన్స్‌. సిబిఎస్‌ఇ పాఠశాలల్లో తరగతికి 20-25 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అప్పుడే ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిపై కేంద్రీకరించగలడు. 9,10 తరగతుల విద్యార్థులకు గణితము, సైన్స్‌, సోషల్‌లలో ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటుంది. 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గణితం, సైన్స్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయి. మన రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, గణితము, ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్స్‌; సోషల్‌ స్టడీస్‌, మొత్తం 7 సబ్జెక్టులలో 11 పేపర్లు వ్రాయాలి. ఈ భారాన్ని తగ్గించుకొకుండా గ్రేడింగ్‌ విధానం అనే పేరుతో పరీక్షా విధానం మార్చామనటం హాస్యాస్పదం.

మన రాష్ట్రంలో గ్రేడింగ్‌ విధానం అమలు చేసే ముందు జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం 2005లో పేర్కొన్నట్లు పాఠ్యప్రణాళిక, పాఠ్య పుస్తకాలు, భారం లేనివిగా నాణ్యమైన విద్యగా తయారుచేయాలి. సిబిఎస్‌ఇ పాఠశాలల్లో లాగా తరగతికి 20-25 మంది మాత్రమే విద్యార్థులు, దాగికనుగుణంగా తగినంతమంది ఉపాధ్యాయులను నియమించాలి. 10వ తరగతి పరీక్షల్లో పేపర్ల సంఖ్యను తగ్గించాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గ్రేడింగ్‌పై అవగాహన కల్గించాలి. అప్పుడే గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశ పెడితే సరైనా ఫలితాలు వస్తాయి. ముందు గ్రేడింగ్‌ విధానాన్ని క్రింది తరగతుల్లో అమలు చేసి ఫలితాలను పరిశీలించి 10వ తరగతిలో ప్రవేశ పెట్టాలి. అలా కాకుంటే మేము గ్రేడింగ్‌ విధానం ప్రవేశ పెట్టాం, పిల్లలకి, తల్లిదండ్రులకీ పరీక్షల వత్తిడి లేకుండా చేశాం అని చెప్పి చేతులు దులుపుకోవటమే అవుతుంది.

ToP
 
 
 
 

PDF
 
 

Copyright © 2008-
A.P.United Teachers' Federation
Mail to : aputf2000@yahoo.com
Home | Ikya Upadhyaya | News | GO's | Statements | STFI | Contact Us