Sun, 5 Sep 2010:
* అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి
* డిఎస్సీ-08 టీచర్లకు రెగ్యులర్ జీతాలివ్వాలి
* యుటిఎఫ్ నేత నారాయణ డిమాండ్
సెప్టెంబర్ 5న జరిపే ఉపాధ్యాయ దినోత్సవాన్ని 'డిమాండ్స్ డే'గా పాటించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నారాయణ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ నియామకాల్లో ఉన్న అసంబద్ధమైన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ-2008 ఉపాధ్యాయులందరికీ టైమ్ స్కేల్‌తో కూడిన రెగ్యులర్ జీతాలివ్వాలని కోరారు. శనివారం యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో డిమాండ్స్ డే పోస్టర్‌ను నారాయణ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అప్రెంటీస్ విధానాన్ని రద్దు చేయాలని, డిఎస్సీ-2008 టీచర్లకు పూర్తిజీతాలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాల్లో బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తామన్నారు. ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. అప్రెంటీస్ వల్ల కలిగే నష్టాలను, ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అప్రెంటిస్ విధానాన్ని రద్దు చస్తే కొంతమందిని సన్మానించడం కాకుండా ఆ విధానం వల్ల నష్టపోయిన మూడు లక్షల మందినీ సన్మానించినట్లవుతుందన్నారు. స్టయిఫండ్ పేరుతో తక్కువ జీతాలిచ్చి ఉపాధ్యాయుల నుంచి శ్రమదోపిడీ చేస్తున్నారని తెలిపారు. రెగ్యులర్ ప్రాతిపదికన నియామకమైన ఉపాధ్యాయులకు రెగ్యులర్ వేతనాలలివ్వాలని తొమ్మిదో వేతన సవరణ సంఘం సిఫారసు చేసినా ప్రభుత్వం ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పారు. 15 ఏళ్ల పోరాటం ఫలితంగా అప్రెంటీస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రభుత్వ పెన్షన్‌కు అనుమతి లభించిందన్నారు. అసలు సమస్య అయిన అప్రెంటిస్ విధానం మాత్రం తొలగిపోలేదన్నారు.